Congress vs BRS: కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం 5 d ago
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటాపోటీగా తలబడ్డాయి. ఇరు పార్టీలు ప్రతిష్ఠకుపోయాయి. పర్యాటక విధానంపై సర్కారు చర్చను ప్రారంభించగా, లగచర్ల రైతుకు బేడీలపై చర్చకు అనుమతించాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. బీఆర్‌ఎస్ నిరసనలు, నినాదాల మధ్య ప్రశ్నోత్తరాల అనంతరం పది నిమిషాలు సభ నడిచింది. మధ్యాహ్నం 2.:30 గంటలకు ప్రారంమైన సభ, 2:40కే వాయిదా పడింది. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత పదేండ్లల్లో పర్యాటక రంగ అభివృద్ధికి సరైన విధానం రూపొందించలేదన్నారు. ఆదాయమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా కొత్త విధానాన్ని అమలుచేయనున్నామని ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పుల కుప్పను, చిప్పను తెలంగాణ ప్రజల చేతికిచ్చిందని వ్యాఖ్యానించారు.
అనంతరం జూపల్లి మరింత వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు అడుగడుగునా అడ్డు తగిలారు. లగచర్లపై చర్చకు పట్టుబడుతూ నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకుంటూ సభా మర్యాదను కాపాడాలని బీఆర్‌ఎస్ నేతలు కె.తారకరామారావు, టి. హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డిని కోరారు. రూల్‌బుక్ అందరమూ కలిసే తయారుచేసుకున్న సంగతిని గుర్తు చేశారు.
సభకు ప్లకార్డులు తేవడం సరికాదనీ, నినాదాలు చేయడాన్ని తప్పుబట్టారని స్పీకర్ అన్నారు. అందరూ కూర్చోవాలని పదే పదే విజ్ఞప్తి చేయగా, బీఆర్‌ఎస్ సభ్యులు సీట్ల దగ్గర ఉండే నిరసన తెలుపుతుండగా, స్పీకర్ మార్షల్స్‌ను పిలిచారు. సభ్యుల దగ్గర ఉన్న ప్లకార్డులు తీసుకోవాలని ఆదేశించారు. మార్షల్స్ ఆ ప్రయత్నం చేస్తుండగానే బీఆర్‌ఎస్ సభ్యులు మార్షల్స్‌ను నెట్టుకుంటూ స్పీకర్ పోడియం దగ్గరకు చేరుకుని మళ్లీ నిరసనకు పూనుకున్నారు. స్పీకర్ పోడియంకు కుడివైపు హరీశ్‌రావు ప్లకార్డుతో వెళ్లగా, ఎడమవైపు కేటీఆర్ మిగతా సభ్యులతో ఆందోళనకు దిగారు. లగచర్ల రైతుకు బేడీలు వేయడం షేమ్ షేమ్ అన్నారు. రైతులకు కరెంటు షాకులు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ఇది జరుగుతుండగానే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలోకి అడుగుపెట్టారు. ఒకవైపు నిరసన, మరోవైపు మంత్రి జూపల్లి ప్రసంగం నడుస్తుండగానే మధ్యలో స్పీకర్ జోక్యం చేసుకుని సభను మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.
బీఆర్‌ఎస్ సభ్యులంతా నినాదాలు చేసుకుంటూ మీడియా పాయింట్ వద్దకు వచ్చి దాదాపు అరగంటపాటు నిరసన తెలిపారు. లాఠీ రాజ్యం, లూటీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, రైతులకు బేడీలు.. మంత్రులకు జల్సాలు అంటూ నినాదాలు చేశారు. రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ లగచర్లలో భూములు ఇవ్వకపోతే జైల్లో పెడతారా ? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా రేవంత్‌రెడ్డి పారిపోయారని విమర్శించారు. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం సభనూ, ప్రజలనూ తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు. రైతులు ఇబ్బంది పడుతుంటే టూరిజంపై చర్చ అవసరమా ? అని కేటీఆర్ ప్రశ్నించారు.